Wednesday, February 18, 2009

చెస్ లో తొలి తెలుగు తేజం


ఇప్పటిలా అప్పుడు స్పాన్సర్ల సాయం లేదు. గెలిస్తే గుర్తించే వారు లేరు.మీడియా ప్రచారం అంత కన్నా లేదు. లేదంటే ....లంక రవి...హరి కృష్ణ కోనేరు హంపి కన్నా ముందే మనందరికీ చిరపరిచితమై ఉండేదొక పేరు!!!!!అదే దర్భా వెంకయ్య!! మొట్టమొదటి నేషనల్ ఛెస్ ఛాంపియన్గా ఆవిర్భవించిన తొలి తెలుగు తేజం దర్భా వెంకయ్య!!!ఆయన గురించి గానీ ఆయన సేవల గురించి గానీ తెలిసిన వారు ప్రస్తుతం తెలుగు నట ఒకరిద్దరేనంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. 1916 లో తుని లో జన్మించిన వెంకయ్య కాకినాడ లో స్థిరపడ్డారు. అక్కడి జగన్నాధ పురం ఎం. ఎస్. ఎం. ఛారిటీస్ హై స్కూల్ లో దాదాపు 35 సంవత్సరాలు పాటు సైన్సు టీచర్ గా పని చేసారు అక్కడే రిటైర్ అయ్యారు. మధ్య తరగతికుటుంబం. చిన్నతనం లోనే ఛెస్ ఫై మోజు పెంచుకున్నారు. సాయంసంధ్యా వేళల్లో... తీరిక సమయాల్లో ఆరు బయట ఆడుతున్న పెద్దల దగ్గర కూర్చొని చెదరంగ ఓనమాలు నేర్చుకున్నారు. పట్టుదలతో ప్రావీణ్యం సంపాదించి పెద్దవారినిసైతం ఓడించేవారు. కాకుంటే ఇప్పటి మాదిరి గా అప్పట్లో టొర్ణమెంట్స్ పెద్దగా ఉండేవి కావు. అనుకోని అవకాశం.... ఆ పరిస్థితుల్లో అల్ ఇండియా ఛెస్ ఛాంపియన్ షిప్ కు ఆంధ్ర రాష్ట్రం ఆతిధ్యం ఇవ్వడం వెంకయ్య కు అనుకోనివరమయ్యింది. తన ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన వేదిక లభించింది. ఆంధ్ర ఛెస్ సంఘం ఆధ్వర్యాన 1955 లో మొట్టామొదటి ఆల్ ఇండియా ఛెస్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏలూరు లో ఘనం గా జరిగాయి. దేశం నలు మూలల నుంచి దాదాపు 100 మంది క్రీడా కారులు పాల్గొన్నరిన్దులో!! చివరకు తన ప్రతిభను చాటి చెప్పుతూ దర్భా వెంకయ్య ఛాంపియన్ గా నిలిచారు. ఐతే మహారాష్ట్ర కు చెందినా ఆర్.బి.సప్రే కూడా ప్రథమ స్థానం లో నిలవడం తో ఇద్దర్నిసంయుక్త విజేతలు గా ప్రకటించారు. పోటీల్లో అప్పట్లో విజేతలకు 500 రూపాయలు, 2 వ స్థానం లో నిలిచిన వారికీ 300 రూపాయలు ఇచ్చేవారు. ఈ లెక్కన సంయుక్త విజేతలు గా నిలిచిన దర్భా వెంకయ్య సప్రే లు ప్రైజ్ మనీని పంచుకోవాల్సి వచ్చింది. ఫలితం గా తొలి జాతీయ ఛాంపియన్ గా వెంకయ్య కు లభించింది 250రూపాయలు. లేఖల ద్వారా.... జాతీయ ఛాంపియన్గా ఆవిర్భవించిన వెంకయ్య రష్యా లో పోటి కి ఎంపికయ్యారు. ఐతే జీతం రాళ్లతో కుటుంబమేగడవటం కష్టమైన పరిస్థితుల్లో సొంత డబ్బులతో రష్యా వెళ్ళడం వెంకయ్యకు కలలోనూ అసాధ్యం. ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. దాంతో అరుదైన, అపూర్వమైన అవకాసం ఆయన చేజారింది, లేదంటే వెంకయ్య పేరు అంతర్జాతీయంగా కూడా మారు మోగేదేమో!!!ఆ తరువాత కొన్నాళ్ళకు అప్పటి కేంద్ర మంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి ఎం. ఎస్. ఎం. ఛారిటీస్ హై స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ మంత్రికి వెంకయ్యను పరిచయం చేసారు.రష్యాలో పోటికి వెళ్ళడం లేకపొయిన సంగతి వివరించారు. దానికి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రస్ట్ నిధులతో వెంకయ్య గారిని రష్యాకు పంపించలేక పోయారా అని నిలదీసారు.మంచి ఆటగాడిని ఈ విధంగా నిరుత్సాహ పరచడం పై ఆవేదనవ్యక్తం చేసారు. అలా అని వెంకయ్య నిరుత్సాహ పడలేదు. తన చదరంగ తృష్ణ ను వదలలేదు. రష్యా లో గల ఆటగాళ్ళతో లేఖల ద్వారా వెంకయ్య చదరంగం ఆడేవారు. ఒక్కో అట పూర్తి అయ్యే సరికి సుమారు రెండు నెలల సమయం పట్టేది. ఒకసారి ఒక ఎత్తు వేసి లేఖ ద్వారా పంపితే, అటు వైపునుంచి ఎత్తు వచ్చిన తరువాతే మళ్ళీ ఎత్తు రాసి పంపించే వారు. వెంకయ్య లోని తపనకు ఇదే నిలువెత్తు నిదర్శనం. ఛెస్ అభివృద్ధి కై కృషి... తనలాగే ఇతరులు కూడా రాణించాలన్న సదుద్దేశం తో వెంకయ్య చదరంగ అభివృద్ధి కి కృషి చేసారు. రాష్ట్ర ఛెస్ సంఘం నిర్మాతల్లో వెంకయ్య కూడా ఒకరు.
తెలుగు నాట ఛెస్ అభివృద్ది కి ఒక సంఘం ఉండాలన్న ఆలోచన తో ౧౯౫౩ లోనే ఔత్సాహికులు కొందరు ఏలూరు కేంద్రంగా చెస్ సంఘాన్ని ప్రారంభించారు.కోమందూరి జగన్నధాచార్యులు అనే న్యాయవాది ఈ సంఘానికి తొలి కార్యదర్శిగా వ్యవహరించారు. విజయవాడ కు చెందినా స్వతంత్ర సమర యోధులు వి.జి.కే.మూర్తి, బలుసు సూర్యనారాయణలు కూడా ఈ సంఘ స్థాపన లో ప్రముఖ పాత్ర పోషించారు. ౧౯౫౫ లో సంఘాన్ని వి.జి.కే.మూర్తి విజయవాడకు తరలించి ఆల్ ఇండియా చెస్ సంఘం గుర్తింపు తీస్కోచ్చారు.తానూ పెద్ద ఆటగాడిననే గర్వం ఎన్నడు వెంకయ్య లో తొంగి చూసేది కాదు. పిల్లలు, జూనియర్లు, సీనియర్లు అనే తారతమ్యం లేకుండా ఎవరితోనైనా అటకు సిద్దమయ్యేవారు. మిత్రులు గొల్లకోటి దీక్షితులు, రెంటాల సుబ్రహ్మణ్యం ల తూ ఆయన ఎక్కువగా ఆడేవారు.చదరంగం ఆడించడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం.పిల్లలతో ఆడేటప్పుడు వారి చేత చివరివరకు ఆడించి ఆటలో మెళకువలు నేర్పేవారు.నిరంతరం చదరంగం లోని ఎత్తులపినే ధ్యాస ఉండేది.అందుకే స్కూల్ హెడ్మాస్టర్ గా ప్రమోషన్ అవకాసం వచ్చినా భోదన కు చదరంగానికు సమయం సరిపోవడం లేదని పరిపాలన భారాన్ని తీసుకోలేనని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ౬౫ ఎళ్ళ వయస్సులో కూడా వెంకయ్య విజయవాడ లో జరిగిన ఓ టోర్నీ లో కుర్రాళ్ళతో కల్సి పాల్గొన్నారు. "అంత పెద్ద అయన రావడం చూసి నేనే ఆశ్చర్య పోయాను. ఆయన ఆట తీరే విలక్షణంగా ఉండేది. మంచి పొసిషనల్ గేమ్ ఆడే వారు." అని ఆ టోర్ణమెంట్లో పాల్గొన్న ఇంటర్నేషనల్ మాస్టర్ లంకరవి ఇరవై ఎళ్ళ కిందటి సంగతిని గుర్తు చేస్కున్నారు.పదవి విరమణ తరువాత వెంకయ్య నాలుగు నెలల పాటు పక్షవాతంతో బాధ పడి 1986 మే 21 న కన్నుమూసారు. వెంకయ్యకు పది మంది సంతానం.వారిలో ఏడుగురు ఆడపిల్లలు ముగ్గురు కుమారులు. సంతానం అధికం కావడం వల్ల ఆర్ధిక భారంతో బాధపడేవారు. ఐన టొర్ణమెంట్లకు వెళ్ళడం మానేవారు కాదు.ఏలూరు లో నిర్వహించిన ఆసియన్ చెస్ చంపియన్ షిప్ పోటీలలో పాల్గొన్న సమయం లో భార్య సీతమహాలక్ష్మికి ప్రసవసమయం ఐనప్పటికీ పోటికి హాజరై ఛాంపియన్ షిప్ సాధించారు.అమ్మయిలు ఐదుగురికీ వివాహం చేసారు. వారిలో ఇద్దరు కాకినాడ లో ఉండగా, ఇద్దరు హైదరాబాద్ లోను ఇద్దరు విశాఖపట్నం లోను ఒకరు విజయవాడ లోను ఉంటున్నారు. ఇంజినీర్లు ఐన ఇద్దరు అబ్బాయిలు చనిపోయారు. మరో కుమారుడికి సరైన ఉద్యోగం లేకపోవడం వలన కుటుంబం కష్టంగా సాగుతోంది. ఆయన భార్యకు పెన్షన్ లభిస్తోంది. ఏభై ఎల్ల కిందటే మన ఆంధ్ర వాణి ఖ్యాతిని దేశానికీ చాటిన మన తొలి ఛాంపియన్కుటుంబాన్ని ఇప్పుడు పట్టించుకునే వారే లేరు. క్రీడాకారుడిగా అభిమానిగా రాష్ట్ర చెస్ అభివృద్ధికి పునాది వేసిన దర్భవెంకయ్య సేవలు ఈ తరానికి తెలియక పోవచ్చు కానీ పతకాలు తెస్తున్న క్రీడా కారులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్న ప్రభుత్వం అలనాటి యోధుల్ని మర్చిపోకూడదు.

No comments: